Wednesday, September 10, 2014

భరింపు

________________కృష్ణ మణి

నేనొచ్చిన కాడినుండి చూస్తున్న
లోకం ఇట్లనే ఉన్నది
ఏదైనా మారిందంటే మనిషి ఒక్కడే !

నీళ్ళు రంగు మారుస్తలేదు 
చెట్టు నడుస్తలేదు
కోతి మాట్లడుతలేదు
సింహం రక్తం తాగెది మారకపాయే
బర్లు గడ్డిని మరువకపాయే!


మరి ఈ నక్కజిత్తుల దొంగ మనిషి
పూట పూటకు గుణం మారుస్తున్నడు ఊసరవెల్లోలె
ఆకలైతెనేమో అమ్మాంటడు
లేకుంటె ఇంకోటి !

ఏమిలేని కాడ
ఏ దేవుడు మాయ జేసిండో
వీనికి ఇంత తెలివి ఇచ్చిండు
వానంతల వాడుంటే మాకెందుకు ఈ లొల్లి
అందరి మీద పెద్దతనం జెయ్యవట్టే ?


నీటిని చెరవట్టిండు సిగ్గులేనోడు
గాలిని గబ్బుజేసిండు
భూమిని బష్టువట్టించిండు
అగ్గిని అదిమిపట్టి పైన కూసుండు
ఎప్పుడైనా తేడవస్తే కాలుతడు
లోకాన్ని కాలుస్తడు !

నేలమీద నిలువలేడు
ఆకాశాన్ని కూడా ఇడువలేడు
అక్కడ గిట మోతుబరి
ఓజోనుకు పొక్కలు గొట్టిండు
ఇప్పుడు ఏం దెల్వదని కండ్లు దించిండు !

నువ్వు పుట్టక ముందే పుడితిమి
కొండలం కొనలం
మా ముందే పుట్టి
మమ్మల్నే ఒంచుతున్నవురా పశువా !

ఓర్సుకుంటున్నం  ఓపికున్నదాక
తర్వాత ఏమైతదో చెప్పం కోడుకా..... !

కృష్ణ మణి I   

No comments:

Post a Comment