Saturday, April 21, 2018

ముళ్ళ తోవ

ముళ్ళ తోవ
______________కృష్ణ మణి

క్షణాలు మెల్లగా జారుకున్నాయి
ఏ స్థితిలో కూడా స్తిరంగా ఉండమని
కాని మనసులో పడిన ఆ స్థితి తాలుకు ముద్ర
గుండె ఆగే వరకు పోనని ఫత్వా ఇచ్చింది

గోడలపై రాతలు చెరిగిపోతాయి కాని
మనః పుస్తకంపై కోతలు అంత త్వరగా మానవు కదా
మనసు వాటిని జయించనంత కాలం
అవి రోజుకో రూపంలో పడుతూనే ఉంటాయి

నీ గుండె చెరువై
బరువై
గడ్డకట్టుకపోయి
నిరుత్సాహం వెంటాడి ఎక్కిరిస్తుంది

కసిగా తలెత్తి సమస్యకు ఎదురు తిరిగినప్పడు
కొండలాంటి సమస్య
ఏనుగు ముందు చీమలా తలవంచితే
దారి విశాలంగా ప్రస్పుటంగా కానవస్తుంది

ఓర్పు ఎప్పుడూ పరీక్షిస్తుంది
అది సమస్య లోనైనా
సమాజంలోనైనా
ఇది ప్రమాదమైనది కూడా

ఓర్పు తగ్గినప్పుడల్లా
తోక నలిగిన పాములా
ఆవేశం కట్టలు తెంచుకొని
నిన్ను పూర్తిగా భస్మం చేస్తుంది
అంతేనా
నీ భస్మం తాలుకు సెగలు
నీ వాళ్ళనూ దహించివేస్తుంది

బొంతపురుగు స్థితిని దాటితేనే కదా
నీవు సీతాకోకచిలుకలా మెరిసేది

కృష్ణ మణి

No comments:

Post a Comment