Saturday, April 21, 2018

మనిషితనం

మనిషితనం
_____________కృష్ణ మణి

మతం గొప్పని
లోకానికి మన మతం దిక్కని చెప్పే ఓ పెద్దలారా
చెప్పున్ని
ఒక్క మాటడుగుతా
చెప్పున్రి

చెప్పు బాపణయ్య
మన మతమెంత గొప్పదో
గుడిల పూజలు నువ్వు జేస్తెనే పలుకుతడంటగదా
స్పర్శ లేని రాయి దేవుడు
మా కన్నప్ప బీరప్పలకు పిలవరాదు గదా నీలెక్క
మమ్ముల జూసి ఇషీషి అంటవు గానీ
మా పోషమ్మ కాడ పైసలొస్తయంటే
పిర్రలుగొడతవు కదా సామీ

అందరమొక్కటే అయితే
మా పోరడు నీఇంటి అల్లుడెందుకుగాడో చెప్పు సామీ

చెప్పు పటేలా
మా రెడ్డి సాబు.... ఓ రాజవర్మ
ఓ నాయుడప్పా చెప్పు
ఇప్పటికీ
ఊర్ల నీ పెత్తనమేనా ?

చెప్పు
కుమ్మరి కమ్మరి మంగలి చాకలి
డక్కలి బ్యాగరి మాల మాదిగలందరూ
నీ బాంచనలేనా ?

చెప్పు
మీ పిల్లతరానికి గూడా ఇషం నింపి
కులం గుంపులు కట్టిపిస్తున్నవుగా బాంచన్

మీ తాతకు
మీ అయ్యకు
నీకు‌ పనిబాటలొల్లమేగా
మీ ఉపాది ఓటర్లమే్గా ?

మా సౌకబాసం వడ్డీలకేనా 
అసలు కోసం
రేపు నీ కొడుకుకు గూడా ఊడిగం చెయ్యాలెనా ?

అందరమొక్కటే అయితే
మా పిల్ల మీ కోడలెందుకు గాదో చెప్పు దొర

మీమేది తినాలెనో మీరే చెప్తరా
మీమేది గట్టాలెనో మీరే గీస్తరా

చెప్పున్రి
ఒక్కటవుదమంటే అవ్వనీకే
ఏండ్లకేండ్లు ఎదురుసూస్తున్నం
ఇంకెంతకాలం సూడాలెనో చెప్పున్రి ?
ఎంతగనం భరించాలెనో చెప్పున్రి ?

కులం గోడలు కూలితేనే
మతం గోడలు గట్టిగుంటయి
మతం గోడలు కూలుతేనే
మనిషి బతుకు సక్కగుంటది

చెప్పున్రి
ఏమన్నా తప్పు జెప్పి
గుండెల తన్నిన్నా
చెప్పున్రి

కృష్ణ మణి

No comments:

Post a Comment