Sunday, July 26, 2015

స్పష్టం

స్పష్టం
______________కృష్ణ మణి

పడుతుంది కష్టంగా అడుగు
అయినా చుట్టూ నా అస్తిత్వ పునాదులే
నన్ను మేలుకొలుపుతున్నాయి అడగడుగున !

ఇప్పుడు
ముస్తాబైన కుండలు
గండ దీపాలు
ఎందుకో కొత్తగా అనిపిస్తున్నాయి
అదెదో నేను మల్లీ పుట్టినట్లు !

నవాబుల కోటలో
అమ్మవారి జాతర
మరచిన చిన్నతనాన్ని తిరిగి పొందాను
చీకటిని దాటి వెలుగునీడను చేరినట్లు !

వేప మండల ఊపుడు
పసుపు భండారి నొసల్లు
నిమ్మకాయల దండలు
ఊగిపోవాలనే ఉత్సాహం
ఆగని ఉద్వేగం
తీన్మార్ దరువు
లయబద్దంగా డోలు తాళం !

చర్లకోలల వీరంగం  
శూలాల మెరుపు
కాలి గజ్జెల గలగలలు
ఆశీర్వచన హస్తాలు
నన్ను నేను కొత్తగ చూసుకున్నట్లు
నా చుట్టేదో వైభవం జరుగుతున్నట్లు !

ఎంత బాగుందో
నేల దుమ్ము నింగికంటే ఊపు నాదనే నిజం స్పష్టమైంది
గుడ్డివానికి ఇప్పుడే చూపోచ్చి తల్లిని గుర్తుపట్టినట్లు !


కృష్ణ మణి   

No comments:

Post a Comment