Sunday, February 14, 2016

పానుపు పాట్లు

పానుపు పాట్లు
_______________కృష్ణ మణి

అరె ..... గుడ్ నైట్ అయిపొయింది
మధ్యరాత్రి రెండు గంటలకు
దోమల పలకరింపులో మిగత రాత్రి తెల్లవారింది

కండ్లు కుచ్చుకొని ఎర్రబడి
మొహం ఉబ్బి
ఒళ్ళు తుళ్ళుతుంది
అయ్యో .... అప్పుడే ఏడయ్యిందా .....?

పిల్లలకు పాలు తేవాలని పొతే
పాలవాడు నిద్రమత్తులో
ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ కలిపినట్టుండు
పాలు గంజిల మారి
చాయి చేదయ్యింది !

ఈడ్చుకొంటూ రోజు మొదలయ్యింది
టైరు పంచర్ అయినట్టు  
నోటికి ముద్ద దిగదు
ఒంటికి రెస్టు లేదు
కంటికి కునుకుపాట్లు

చుట్టూ ఉన్న మిత్రుల
ఎక్కిరింపుల పలకరింపులు
ప్రాణం జారింది అవమానంగా
నరకంలో కూర్చునట్టుగా
గడియారం ముళ్ళను లేక్కబెడుతూ గడిపాను  !

హమ్మయ్య .....
హస్తమిస్తున్న సూర్యున్ని మనసున హత్తుకొని
పద పదంటూ ఇంటికి పరుగుబెడితే
ముల్లకంపలో చిక్కిన పిట్టలా
బైక్ ట్రాఫిక్లో ఇరుక్కుంది !

చెదిరిన నవ్వును ఎంత బిగబట్టి చూపినా
నా దీనావస్తను గమనించిన పిల్లలు కూడా నవ్వలేరు మురిపెంగా
కునుకు కోసం కురుకుపాట్లతో నేను
తల్లో మల్లెలతో మా ఆవిడ
లోకం మరిచే నిద్ర పట్టింది  
కనులు కలువల్లా విచ్చుకొన్నాయి పొద్దున్నే హాయిగా  

కాని ఏం చెయ్యను
విసుగుతో ఎదురొచ్చింది  
చాయ్ కప్పు ......!
  

కృష్ణ మణి 

No comments:

Post a Comment