Tuesday, January 9, 2018

నవ్వలేని పువ్వులం

నవ్వలేని పువ్వులం
______*****______

నా కన్నులు వెతుకుతున్న ప్రేమ తనేనేమో !
ఆ కన్నుల చూపు ఈటళ్ళా మనసుకు గుచ్చుకొంటున్నాయి
అతను అలా అలవిరిసిన గాలి వలే
నాకు దగ్గరగా కదులుతూ ఉంటే
ఎదో మత్తు అవహించి సోలి పడ్డాను

తనకు కొండల్లాంటి భుజాలు లేవు
సింహం లాంటి నడక లేదు
పులి లాంటి కంఠం లేదు
గర్వపడే ఎత్తు లేదు
నాపై హిమాలయాలంతా ప్రేమ తప్పా

ఐశ్వర్య రాయ్లా
కన్నులతో ప్రేమ వర్షం కురుపిస్తున్నాడు
సున్నితమైన చేతి ముని వేళ్ళ స్పర్శ
చక్కిలి గిలి పెడుతుంది
ఆ పలకరింపు
ఎన్నో జన్మల బంధాలను ఒక్కసారిగా తట్టి లేపింది

ఈ జీవితం
తనదేనని... తనతోనేనని
నిర్దారణ అయ్యాక కూడా
ఒక సంశయం వెన్నాడుతుంది
సమాజాన్ని ఎదిరించి నిలువగలమానని

సాహసించలేని ఒక నిస్సాహాయ స్థితిలో
ఎంతకాలమని దాపరికిపు సాంగత్యం మాది
మనుషులుగా కలిసి బతకని జనాలు
మనసులలో కలిసే బతికే మాపై ఆంక్షల సంకెళ్ళా ?
తెంచుకునే తీరుతాం
బరితెగించి తిరుగుతాం

మేమూ
మీ కడుపుల పుట్టిన పిల్లలమే గాని
అందరిలా బతకలేని పువ్వులం

కృష్ణ మణి

No comments:

Post a Comment