Friday, December 30, 2016

అర్ధమయ్యింది

అర్ధమయ్యింది
____________________కృష్ణ మణి

ఊరవతల ఊరవిచ్చుకల ఉరుకులాటను జూసి
పిట్టల అల్లరనుకున్నాను
అది పామెంట వడుతున్న అమ్మ తనపు ఆవేశమని  
మెల్లంగ అర్ధమయ్యింది

అంబా అని  ఆవు అరుస్తుంటే
పల్లెకే అందమని మురిశిన
అది దొడ్డిల గట్టేశిన లేగకోసమని
మెల్లంగ అర్ధమయ్యింది

నాటేస్తున్న అమ్మల పాటను ఇని
కొండలు నిద్రబోతున్నయనుకున్న 
అది ఆకలి గొంతుల అరుపులని  
మెల్లంగ అర్ధమయ్యింది

శేన్లళ్ళ గొర్లమందల నిద్రలు జూసి
దుక్కిల ఒళ్ళు అందమయ్యిందనుకున్న
అది పట్నం కడుపులో తేలే మూగ నాల్కెలని
మెల్లంగ అర్ధమయ్యింది

ఊరు మెల్లంగ రంగుమారుతుంటే
షోకుల పరుగులని నవ్వుకున్న
అది ఆరిన బతుకు పోరాటాల కొత్త శిత్రమని
మెల్లంగ అర్ధమయ్యింది

ఏమర్దమయినా మెల్లంగ
ఆకిరికి అర్ధమయ్యింది ఎందంటే
ఆకలి తిప్పల ఆరాట పోరాటాలే ఎక్కడ జూసిన

కృష్ణ మణి



No comments:

Post a Comment